అశోక్‌నగర్‌ సమీపంలో అరుదైన విషపాము.. సురక్షితంగా పాకాల అడవిలో విడుదల..#AndariTV #DigitalNews #SnakeRescue #WildlifeProtection #TelanganaNews #Pakhal

Date: 2026-08-12
news-banner
అందరి టీవీ డిజిటల్ న్యూస్: అశోక్‌నగర్‌ గ్రామ సమీపంలో అరుదుగా కనిపించే విషపూరితమైన బ్యాండెడ్‌ క్రైట్‌ పాము స్థానికుల కంటపడటంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గ్రామ సమీపంలో పాము కనిపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. పామును చూసిన స్థానికులు భయాందోళనకు గురైనప్పటికీ, దానిని చంపకుండా సురక్షితంగా పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.
గ్రామానికి చెందిన శ్రీకాంత్‌, శ్రవణ్‌, నవీన్‌, ప్రకాశ్‌ పామును గుర్తించారు. పాము విషపూరితమైనదిగా గుర్తించి, ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ దానిని పట్టుకున్నారు. అనంతరం పామును పాకాల అటవీశాఖ సిబ్బందికి అప్పగించేందుకు అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పాకాల అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. FSO ధర్మ, జయప్రకాశ్‌, విజయ్‌, రాజు, మహేష్‌ పామును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా పాకాల అభయారణ్యానికి తరలించారు. అటవీశాఖ అధికారులు పామును సహజ ఆవాసంలో ఎలాంటి ప్రమాదం కలగకుండా సురక్షితంగా వదిలారు.
బ్యాండెడ్‌ క్రైట్‌ పాము విషపూరితమైన జాతికి చెందినదిగా గుర్తించడంతో స్థానికులు మరింత అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సిబ్బంది సూచించారు. ముఖ్యంగా గ్రామ శివార్లు, పొలాలు, పొదలు, కట్టెలు లేదా రాళ్ల కుప్పల వద్ద రాత్రి వేళల్లో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పాములు కనిపించినప్పుడు వాటిని చంపకుండా సంబంధిత అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు.
పామును సురక్షితంగా పట్టుకుని అటవీశాఖకు సమాచారం అందించిన స్థానికులను పలువురు అభినందించారు. వన్యప్రాణులను సంరక్షించడంతో పాటు, ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా పామును సురక్షిత ప్రాంతానికి తరలించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Leave Your Comments