అందరి టీవీ డిజిటల్ న్యూస్|ఉర్సు గుట్ట ప్రాంతంలో రక్తాసిక్తమైన వీధి..
వరంగల్ నగర పరిధిలోని ఉర్సు గుట్ట సమీపంలో శుక్రవారం అత్యంత ఘోర ఉదంతం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్న మాడ అనిల్ (23) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా హత్య చేసినట్లు సమాచారం. పక్కా ప్రణాళిక ప్రకారమే అనిల్‌ను అడ్డుకున్న దుండగులు, పదునైన ఆయుధాలతో తీవ్రంగా గాయపరిచి, ఆపై గొంతుకోసి అక్కడికక్కడే ప్రాణాలు తీయగా.. రక్తమడుగులో పడివున్న అనిల్‌ను చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పాత కక్షలు – రాజకీయ విరోధం?
ఈ కిరాతక హత్య వెనుక పాత కక్షలతో పాటు రాజకీయ విభేదాలు ఉన్నాయని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తికి, అనిల్‌కు మధ్య కొంతకాలంగా తీవ్రస్థాయిలో తగాదాలు నడుస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కక్ష పెంచుకున్న అతను, తన అనుచరులతో కలిసి ఈ పగ తీర్చుకున్నాడని స్థానికులు, అనిల్ అనుచరులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా వీరిద్దరి మధ్య పలుమార్లు చిన్నపాటి ఘర్షణలు జరిగినట్లు తెలుస్తోంది.
రంగంలోకి దిగిన ఏజే మిల్స్ కాలనీ పోలీసులు..
సమాచారం అందుకున్న వెంటనే ఏజే మిల్స్ కాలనీ సీఐ, ఎస్ఐలతో పాటు పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. హత్య జరిగిన తీరును పరిశీలించి, వేలిముద్రల నిపుణులు (Clues Team) మరియు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించిన అనంతరం, మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఎంజీఎం (MGM) ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.