తెలంగాణ ఉద్యమకారులకు భూములు ఇవ్వాలి: అంబటి శ్రీనివాస్

Date: 2026-09-24
news-banner
అందరి టీవీ డిజిటల్ న్యూస్ నర్సంపేట: తెలంగాణ జన సమితి నర్సంపేట డివిజన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం రాజకీయాలకు అతీతంగా సాగిందని, స్వరాష్ట్ర సాధన కోసం అమరులైన వారి కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని అంబటి శ్రీనివాస్ అన్నారు. 22A కింద ఉన్న ప్రభుత్వ భూములపై సమగ్ర న్యాయ విచారణ జరిపించి, అర్హులైన తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు భూములు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ధరణి పేరుతో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన కోరారు. బాధ్యులుగా తేలిన వ్యక్తులు, సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాలు గడిచినా తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కాలేదని అంబటి శ్రీనివాస్ విమర్శించారు. ఎన్నికల సమయంలో తెలంగాణ జన సమితితో కలిసి పోటీ చేసిన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.
రెండు ఎమ్మెల్సీ పదవులు, ఐదు కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఐదు జిల్లా స్థాయి చైర్మన్ పదవులపై ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఉద్యోగ క్యాలెండర్‌ను వెంటనే ప్రకటించి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, నిరుద్యోగులకు భరోసా కల్పించాలని కోరారు. జీవో 95 ప్రకారం పాలిటెక్నిక్ కళాశాలలను మూసివేయడం సరికాదని, వెంటనే జీవో 95ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ స్వీకరించిన సమాచారాన్ని ప్రభుత్వం పరిశీలించి, నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలని అంబటి శ్రీనివాస్ కోరారు. అర్హులైన ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు జారీ చేసి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం వారికి భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జన సమితి రాష్ట్ర నాయకులు గుంటి రామచందర్, బోనగాని రవీందర్, మహమ్మద్ మెహబూబ్ అలీ, సాంబరాతి మల్లేశం, కాసాని పద్మ, రామగిరి మాధవి, అకారపు సరోజన, రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave Your Comments