అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా ప్రత్యేకం:
పెద్ది కుటుంబానికి అండగా కేసీఆర్.. పిల్లల భవిష్యత్తుకు భరోసా...
వరంగల్/నల్లబెల్లి: దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు.
పెద్ది సుదర్శన్ రెడ్డితో కేసీఆర్‌కు సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది. ఆయన తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కేసీఆర్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు వైద్యులను కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ వర్గాల ప్రకారం, పెద్ది పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అన్ని ప్రయత్నాలు చేయాలని కేసీఆర్ కోరారు.
అయితే చికిత్స పొందుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి చెందడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది. ఆయన ఐదు రోజుల పాటు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం మృతి చెందినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి.
కుటుంబానికి ఆర్థిక భరోసా...
పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ తరఫున రూ.2 కోట్ల 25 లక్షల ఆర్థిక సాయం అందించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం చెరో రూ.1 కోటి చొప్పున రూ.2 కోట్లు, వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షలు అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా పిల్లల చదువు, భవిష్యత్తు, కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన కేసీఆర్
పెద్ది కుటుంబానికి భవిష్యత్తులో కూడా పార్టీ అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చించినట్లు సమాచారం.
దశదినకర్మ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం జిల్లా పార్టీ ముఖ్య నేతలు సమావేశమై కుటుంబ సంక్షేమానికి సంబంధించిన తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కుటుంబాన్ని పరామర్శించనున్న కేసీఆర్?
ఇదిలా ఉండగా రేపు నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
దీంతో పెద్ది కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు, కుటుంబానికి పార్టీ తరఫున అందించే సహాయం, భవిష్యత్తు భరోసాపై కేసీఆర్ మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నమ్మిన నాయకుడిని కోల్పోయిన పెద్ది కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తామని కేసీఆర్ ఇచ్చిన భరోసా పై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు
కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలువడం మరియు పెద్ది లక్షల ప్రజల గుండెల్లో ఉండడంపై పలువురు పెద్ది చిరస్మరరణీయుడిగా జె జె లు పలుకుతున్నారు.