దాడులు, బెదిరింపులతో బీఆర్ఎస్‌ను భయపెట్టలేరు ప్రజా సమస్యలకు సమాధానం చెప్పాలి.. రౌడీయిజం రాజకీయాలు మానుకోవాలి: మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్#DasyaVinayBhaskar #KTR #BRS #Hanumakonda #Warangal #BRSPressMeet #TelanganaPolitics #NagarlaVenkateshwarlu #

Date: 2026-11-25
news-banner
అందరి టీవీ డిజిటల్ న్యూస్: హనుమకొండ, నవంబర్ 25: బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల్లో అసహనం మొదలైందని, ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి తట్టుకోలేక అసత్య ప్రచారాలు, అనవసర వ్యాఖ్యలు చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు.

బుధవారం హనుమకొండలో భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నగర ప్రజలను ఉద్దేశించి నిర్వహించిన సభకు విశేష స్పందన లభించిందన్నారు. ఈ స్పందనను జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు అనవసర వివాదాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి, ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీని స్థాపించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజలు ఇలాంటి ఘటనలను తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు, అభివృద్ధి, ప్రజా సమస్యలపై ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని శాంతియుత ఉద్యమంతో సాధించిన తాము ఎంతగా రెచ్చగొట్టినా సంయమనం కోల్పోమని స్పష్టం చేశారు. దాడులు, బెదిరింపులు, అక్రమ కేసులు, అరెస్టులతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను భయపెట్టలేరన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక కొందరిని ఉసిగొల్పి దాడులకు పాల్పడటం సరైన విధానం కాదని, ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలకు సమాధానం చెప్పాలని హితవు పలికారు.

సుమారు 200 మంది కార్యకర్తలను నాలుగైదు పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఇబ్బందులకు గురిచేయడం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు పోలీస్ స్టేషన్లకు చేరుకుని కార్యకర్తలకు న్యాయ సహాయం అందించారని తెలిపారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల వ్యవహారశైలిలో మార్పు రాకపోతే చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకత్వం, ఉద్యమకారులకు అండగా నిలిచి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేసిన నేతలపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా వరంగల్ అభివృద్ధికి, ఐటీ కంపెనీల ఏర్పాటుకు బీఆర్ఎస్ హయాంలో విశేష కృషి జరిగిందని గుర్తుచేశారు.

తమకు సవాల్ విసురుతున్న నాయకులకు నిజంగా ప్రజలపై, తమ అభివృద్ధిపై నమ్మకం ఉంటే పదవులకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్ చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి ఎన్నికలకు వస్తే ప్రజలే ఎవరి వైపు ఉన్నారో తేలుస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని, రౌడీయిజం, వ్యక్తిగత దూషణలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వరంగల్ నగరంలో రౌడీ సంస్కృతికి తావులేదని, రాజకీయాల్లో హింసకు బదులుగా ప్రజాస్వామ్య విలువలను పాటించాలని కోరారు.

బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని ఖండించిన నాగుర్ల వెంకటేశ్వర్లు..

మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని నగర ప్రజలతో పాటు జిల్లా ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను విద్యార్థులు, మహిళలు సహా ఏ వర్గం ప్రజలు కూడా హర్షించరన్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ విభేదాలను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకోవాలే తప్ప దాడులకు దిగడం సరికాదన్నారు.

బీఆర్ఎస్ హయాంలోనే వరంగల్ అభివృద్ధి..

వరంగల్ జిల్లాను బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. కేసీఆర్ నాయకత్వంలో గతంలో ఉన్న పది జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసి పరిపాలనను ప్రజలకు చేరువ చేశామని తెలిపారు. జిల్లాల విభజనతో భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ, వరంగల్ ప్రాంతాలకు ప్రత్యేక జిల్లా కేంద్రాలు ఏర్పడి పరిపాలనా సౌకర్యాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కాళోజీ కళాక్షేత్రం, నాయినినగర్ బ్రిడ్జి, తాజ్‌పేట ఫ్లైఓవర్ వంటి కీలక అభివృద్ధి పనులు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ నాయకత్వంలోనే సాకారమయ్యాయని పేర్కొన్నారు. 80 నుంచి 90 శాతం పూర్తయిన పనులను ప్రారంభించి తమ ప్రభుత్వ అభివృద్ధిగా చెప్పుకోవడం విడ్డూరమని విమర్శించారు.

కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా సాగునీటి సౌకర్యాలు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో వరంగల్ నగరం స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంకులు సాధించడంతో పాటు 2022లో ఫాస్ట్ మూవింగ్ సిటీ విభాగంలో జాతీయ స్థాయిలో మూడో స్థానం పొందిందని గుర్తుచేశారు.

రైతుల సమస్యలపై బహిరంగ చర్చకు సిద్ధం..

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రోజుకు ఎన్ని గంటల విద్యుత్ అందిస్తోంది? సాగునీరు, తాగునీటి పరిస్థితి ఏమిటి? పంటల బీమా పథకం అమలు ఎక్కడ వరకు వచ్చింది? వంటి అంశాలపై బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. పరకాల లేదా జనగామ ప్రాంతాల్లో ఏదైనా గ్రామాన్ని ఎంపిక చేసుకుని రైతుల సమక్షంలో బహిరంగ చర్చ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలని కోరారు. గత ప్రభుత్వ పనులను తమ ఖాతాలో వేసుకోవడం మానుకుని ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

పలువురు బీఆర్ఎస్ నాయకులు హాజరు...

ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు మర్రి యాదవ రెడ్డి, సంగంరెడ్డి సుందర్ రాజు యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఇమ్మడి రాజు, దాస్యం విజయ్ భాస్కర్, కుసుమ లక్ష్మీనారాయణ, ఉడతల సారంగపాణి, వద్దిరాజ్ గణేష్, సోదా కిరణ్, జోరిక రమేష్, సంకు నర్సింగ్ రావు, మేకల బాబు రావు, నాయకులు పులి రజినీకాంత్, నయీమొద్దీన్, రామ్మూర్తి, నార్లగిరి రమేష్, దర్శన్ సింగ్, పుష్ప, ఎస్కే మహమూద్, వేణుగోపాల్, వీరస్వామి, అనిల్, సందీప్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

అందరి టీవీ డిజిటల్ న్యూస్ | హనుమకొండ

Leave Your Comments

Trending News