నర్సంపేట, అందరి టీవీ డిజిటల్ న్యూస్:
నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు, వేసవికాలంలో చల్లని తాగునీటిని అందించే లక్ష్యంతో మాజీ ఉపాధ్యాయుడు శ్రీ సిద్ధోజు లక్ష్మణాచారి పాఠశాలకు వాటర్ డిస్పెన్సర్‌ను బహుకరించారు.
గతంలో ఇదే పాఠశాలలో పదేళ్ల పాటు ఆంగ్ల ఉపాధ్యాయుడిగా సేవలందించిన లక్ష్మణాచారి (ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, ప్రభుత్వ ప్రాక్టీసింగ్ పాఠశాల, హనుమకొండ) గతంలోనూ పాఠశాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. పాఠశాలపై ఉన్న మమకారంతో విద్యార్థుల సౌకర్యార్థం ఈ వాటర్ డిస్పెన్సర్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు కలిసి లక్ష్మణాచారిని శాలువాతో ఘనంగా సత్కరించి, హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. "పాఠశాల అభివృద్ధిలో సమాజం మరియు దాతలు భాగస్వాములైనప్పుడే ప్రభుత్వ పాఠశాలలు మరింత ప్రగతి సాధిస్తాయని, ప్రతి ఒక్కరూ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని" ఆకాంక్షించారు.