నవంబర్ 22న కామాక్షి అన్నప్రసాద మండప సహిత కళాతోరణ వేదిక ప్రారంభోత్సవం...
అందరి టీవీ డిజిటల్ న్యూస్ నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్తా అయ్యప్ప స్వామి దేవాలయంలో నూతనంగా నిర్మించిన కామాక్షి అన్నప్రసాద మండప సహిత కళాతోరణ వేదిక ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పోస్టర్ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ నెల 22-11-2026, ఆదివారం ఉదయం 4:40 గంటలకు అశ్విని నక్షత్రయుక్త తుల లగ్నంలో ప్రవేశ సుముహూర్త కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
దివంగత దోమకుంట్ల అన్నమ్మ, దివంగత కేదారి గార్ల జ్ఞాపకార్థం వారి కుమారుడు దోమకుంట్ల సుమతి-సదానందం దంపతులు, కుమార్తె-అల్లుడు జూలూరి జ్యోతి-రాజేంద్రప్రసాద్, వారి కుమారుడు హరిహరన్ కుటుంబ సభ్యులు ఈ నిర్మాణాన్ని చేపట్టి దేవాలయానికి అంకితమివ్వడం అభినందనీయమని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరుకానున్నారు. ఆహ్వానితులుగా నర్సంపేట పురపాలక సంఘ చైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్, 26వ వార్డు కౌన్సిలర్ మండల శ్రీదేవి-శ్రీనివాస్ పాల్గొననున్నారు.
శ్రీ ధర్మశాస్తా అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆలయ పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్, అధ్యక్షులు సైఫా సురేష్, ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి, కోశాధికారి దొడ్డ రవీందర్, దివంగత వ్యవస్థాపక చైర్మన్ శింగిరికొండ రామాంజనేయులు ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ పవిత్ర ప్రారంభోత్సవ వేడుకకు అయ్యప్ప స్వామి భక్తులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.