అందరి టీవీ డిజిటల్ న్యూస్:వరంగల్ జిల్లా (నర్సంపేట):ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నర్సంపేట జిల్లా ఆస్పత్రి ఆవరణలో రూ.20 లక్షల వ్యయంతో నూతన టాయిలెట్స్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ తెలిపారు.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ఈ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.
ప్రజల సౌకర్యార్థం చేపడుతున్న ఈ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల అవసరాలే ప్రాధాన్యంగా, అభివృద్ధి పనులే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, మున్సిపల్ కమిషనర్ కంచర్ల నరేష్ రెడ్డి, కౌన్సిలర్లు పున్నం నరసింహారెడ్డి, పొన్నాల మనిషా ప్రకాష్, మున్సిపల్ ఏఈ చంద్రమౌళి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ములుకల మనీష్ తదితరులు పాల్గొన్నారు.