అందరి టీవీ డిజిటల్ న్యూస్:రిపోర్టింగ్: కామిశెట్టి రంజిత్ కుమార్ పటేల్, కరస్పాండెంట్, అందరి టీవీ డిజిటల్ న్యూస్ (వెబ్ డెస్క్).📍 మహబూబాబాద్ రూరల్:
మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామంలో మునిగె సుస్మిత (25) అనే యువతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో జిల్లా కేంద్రంలో ఎస్సై (SI) శిక్షణ పొందుతున్న ఆమె ఊహించని విధంగా తనువు చాలించడం గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.
🔹 వివరాల్లోకి వెళితే..
నడివాడ గ్రామానికి చెందిన మునిగె కుమారస్వామి, సుకన్య దంపతులు వ్యవసాయం, కిరాణా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా, పెద్ద కుమార్తె సుస్మిత డిగ్రీ పూర్తి చేసింది. కొంతకాలంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఆమె, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఎస్సై ఉద్యోగ శిక్షణకు క్రమం తప్పకుండా హాజరవుతోంది.
🔹 పోలీసుల దర్యాప్తు..
సుస్మిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మహబూబాబాద్ రూరల్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉన్నత లక్ష్యంతో కష్టపడి చదువుతున్న యువతి ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.