అందరి టీవీ డిజిటల్ న్యూస్:స్టేషన్ ఘన్పూర్: జాతీయ రహదారిపై భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డీజిల్ లీకేజీ కారణంగా ఓ డస్టర్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే కారు పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు.వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు వ్యక్తులు డస్టర్ కారులో హనుమకొండ నుంచి మల్లన్నగండికి బయలుదేరారు. ఈ క్రమంలో స్టేషన్ ఘన్పూర్ జాతీయ రహదారిపైకి చేరుకోగానే కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వెలువడ్డాయి. దీనిని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును రహదారి పక్కన నిలిపివేశాడు. అనంతరం కారులో ఉన్న ఇద్దరూ వెంటనే కిందకు దిగారు.
కొద్దిసేపటికే డీజిల్ లీకేజీ కారణంగా కారులో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. చూస్తుండగానే కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
డ్రైవర్ అప్రమత్తతతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయం నుంచి బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. కళ్ల ముందే కారు మంటల్లో కాలిపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.