అందరి టీవీ డిజిటల్ న్యూస్ ఉమ్మడి వరంగల్ జిల్లా: హోటళ్లలో ఆహారం తినే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వరంగల్ మండి బజార్‌లోని ఖుర్షీద్ బిర్యానీ హోటల్‌పై మంగళవారం టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో పలు ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. హోటల్ ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఫ్రోజన్ చికెన్, సగం ఉడికించిన చికెన్, సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఆహార పదార్థాలను మూతలు లేకుండా ఉంచడం, వంటగదిలో బొద్దింకలు ఉండటం, గోడలకు బూజు పట్టడం, నేల అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. హోటల్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ప్రదర్శించకపోవడం, సిబ్బందికి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకపోవడం, పెస్ట్ కంట్రోల్ రికార్డులు, నీటి నాణ్యత పరీక్ష నివేదికలు అందుబాటులో లేకపోవడం వంటి మొత్తం 12 రకాల ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో సంబంధిత హోటల్ యజమానిపై ఆహార భద్రతా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు సూచించారు.
హోటళ్లలో బిర్యానీ, ఇతర ఆహార పదార్థాలు తినే వినియోగదారులు కేవలం రుచి మాత్రమే కాకుండా.. ఆహారం తయారయ్యే ప్రదేశం పరిశుభ్రత, నాణ్యతపై కూడా దృష్టి పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.