అందరి టీవీ డిజిటల్
హైదరాబాద్ జిల్లా ప్రతినిధి
ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు మరో ప్రాణాన్ని బలిగొన్నాయి. అప్పు వసూలు పేరుతో నిర్వాహకులు పెట్టిన ఒత్తిడి, బెదిరింపులు తట్టుకోలేక ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. శ్రీను అనే కానిస్టేబుల్ నాలుగు నెలల క్రితం ఓ ఆన్‌లైన్ లోన్ యాప్ ద్వారా రూ.40 వేల రుణం తీసుకున్నాడు. అయితే రుణాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి.
గంటకోసారి ఫోన్లు చేస్తూ డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. అంతేకాకుండా శ్రీనుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు నగ్న చిత్రాలు పంపిస్తామని, భార్యకు సంబంధించిన మార్ఫింగ్ నగ్న చిత్రాలను పంపిస్తామంటూ బెదిరించినట్లు సమాచారం.
ఈ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీను ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల వెనుక ఎవరున్నారు? బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులు ఎవరు? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
రిపోర్టర్: హైదరాబాద్ జిల్లా ప్రతినిధి
ఈ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇలాంటి మరిన్ని తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, రాజకీయ, సామాజిక, జిల్లా స్థాయి విశేషాల కోసం చూస్తూనే ఉండండి.
అందరి టీవీ డిజిటల్ – ప్రజల గొంతుక.. ప్రజల కోసం!