అందరి టీవీ డిజిటల్ న్యూస్ నర్సంపేట: వరంగల్ జిల్లా పాకాల సరస్సులో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ తల్లి సరస్సులో దూకి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే.. గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన మమత, అదే గ్రామానికి చెందిన ఈరెల్లి సుమన్‌ను కులాంతర వివాహం చేసుకున్నట్లు సమాచారం. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే భర్త సుమన్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది.ఈ క్రమంలో వారం రోజుల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించినట్లు సమాచారం. అయినప్పటికీ కుటుంబ కలహాలు పరిష్కారం కాకపోవడంతో మమత తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఇద్దరు పిల్లలతో కలిసి పాకాల సరస్సుకు చేరుకున్న మమత, టికెట్ తీసుకుని బోటింగ్ ప్రాంతానికి వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం. అక్కడ చోటుచేసుకున్న ఘటనలో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, దుగ్గొండి సీఐ శంకరయ్య, ఖానాపురం ఎస్ఐ రామ్మోహన్ పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
మమత స్వగ్రామమైన ఎలుకుర్తి హవేలీ నుంచి పాకాల సరస్సు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆమె అక్కడికి ఎప్పుడు, ఎలా చేరుకుంది? ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది. ఇలాంటి తాజా వార్తల కోసం అందరి టీవీ డిజిటల్ న్యూస్ ఛానల్‌ను Subscribe చేయండి.