అందరి టీవీ డిజిటల్ న్యూస్: గ్రేటర్ వరంగల్: వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు.డివిజన్లోని వినాయక నగర్, గణేష్ నగర్, రామకృష్ణాపురం, తిమ్మాపూర్, సత్యసాయి కాలనీలలో రూ.3.98 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ప్రజల అవసరాలను తీసుకెళ్లి అధికంగా నిధులు మంజూరు చేయిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని అన్నారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, డివిజన్, కాలనీలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ అధ్యక్షులు రాజ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ అరుణ విక్టర్, జిల్లా కార్యదర్శి కొమురవెల్లి యాదవ్, కార్యదర్శి ప్రకాష్, మాజీ జెడ్పీటీసీ నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు బాబురావు, అరుణ, శివకుమార్, రవీందర్, పెద్ద భాస్కర్, సుదాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.