అందరి టివి డిజిటల్ న్యూస్|వరంగల్ జిల్లాలోని నర్సంపేట పోలీసులు భారీ గంజాయి రవాణాను అడ్డుకుని 28 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఒడిశా రాష్ట్రం నుంచి భద్రాచలం–మహబూబాబాద్–నర్సంపేట మీదుగా హైదరాబాద్‌కు బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు తెలిసింది.
దీంతో ఎస్సై అరుణ్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మహబూబాబాద్ బైపాస్ రోడ్డులో మాటు వేసి బొలెరో వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు పరారవగా, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
వాహనం కింది భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన రహస్య బాక్సుల్లో గంజాయిని దాచినట్లు గుర్తించారు. తహసీల్దార్ సమక్షంలో బాక్సులను తెరిచి పరిశీలించగా సుమారు ₹14 లక్షల విలువైన 28 కిలోల ఎండు గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టైన నిందితులు అమృత బైద్యాయ్ మరియు పుజూర్ రాయ్, ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లాకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
గంజాయి రవాణాను అడ్డుకుని కేసును ఛేదించిన నర్సంపేట పోలీసు బృందాన్ని నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి అభినందించారు. అరెస్టైన ఇద్దరు నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.