అందరి టివి డిజిటల్ న్యూస్: ములుగు రిపోర్టర్ గంగాధర్, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పిలుపునిచ్చారు. ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకుని గురువారం ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ జీవితం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన విశిష్ట సేవలను జిల్లా ఉన్నతాధికారులు స్మరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ జయంతిని రాష్ట్ర పండుగలా నిర్వహిస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
ఆచార్య జయశంకర్‌కు తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషలపై విశేష పట్టు ఉందని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి దూరదృష్టితో అనేక ప్రణాళికలను రూపొందించిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జీ, సంపత్ రావు, డీఆర్ఓ రవికుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కుషిల్ వంశీ, డీపీఆర్ఓ రఫిక్, కలెక్టరేట్ ఏఓ రాజ్‌కుమార్, సూపరింటెండెంట్లు మహేష్ బాబు, మంజుల, శివకుమార్‌తో పాటు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.