దురాశే సైబర్ నేరగాళ్లకు ఆయుధం.. అప్రమత్తతే రక్షణ.#AndariTVDigitalNews #CyberCrime #CyberSafety #Hanumakonda #DCPDharaKavitha #CollectorNRavi

Date: 2026-08-06
news-banner
హనుమకొండ, ఆగస్టు 5 (అందరి టీవీ డిజిటల్ న్యూస్): వ్యక్తిగత, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దు.   డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ సేవల వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా విస్తరిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇటువంటి మోసాల నుంచి రక్షణ పొందవచ్చని హనుమకొండ డీసీపీ ధార కవిత అన్నారు. దురాశ, అవగాహన లేమిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని భారీగా మోసాలకు పాల్పడుతున్నారని ఆమె హెచ్చరించారు.
బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బందికి సైబర్ భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. రవి, హనుమకొండ డీసీపీ ధార కవిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీసీపీ ధార కవిత మాట్లాడుతూ, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్, డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరగడంతో పాటు ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలు కూడా ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా సైబర్ నేరాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
సైబర్ నేరగాళ్లు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, తక్కువ ధరలకు వస్తువుల విక్రయాలు, ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజలను వలలో వేసుకుంటున్నారని చెప్పారు. అనంతరం ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డు సమాచారం, యూపీఐ పిన్‌లు, వ్యక్తిగత వివరాలను ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, నకిలీ వెబ్‌సైట్లు, లింకుల ద్వారా సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు.
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో కనిపించే ప్రకటనలను నమ్మి పెట్టుబడులు పెట్టకూడదని, అపరిచితులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని, అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు వెంటనే అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ, ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా సైబర్ నేరగాళ్ల మోసాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయనే ఆశ చూపి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ముందుగా సైబర్ భద్రతపై పూర్తి అవగాహన పెంపొందించుకొని, అదే అవగాహనను ప్రజల్లో కూడా కల్పించాలని సూచించారు.
సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని అధికారులు పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీలు నిర్వహించే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద లింకులు, సందేశాలు, ఫోన్ కాల్స్‌కు స్పందించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమం ముగింపులో అధికారులు, సిబ్బంది సైబర్ నేరాల నివారణకు తమ వంతు బాధ్యతగా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ శ్రీనివాస్, డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్య, హనుమకొండ, కాజీపేట ఏసీపీలు పింగిలి ప్రశాంత్ రెడ్డి, నరసింహారావు, డీఆర్‌డీఓ మేన శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave Your Comments