జనగామ | అందరి టివి డిజిటల్ న్యూస్జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. మొక్కజొన్న చేనులో వ్యవసాయ పనులు చేస్తున్న స్వప్న అనే మహిళపై సుమారు 12 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ ఒక్కసారిగా దాడి చేసింది. మహిళ కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు వెంటనే స్పందించి ఆమెను పాము బారి నుంచి రక్షించి జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనలో విశేషమేమిటంటే, దాడి చేసిన కొండచిలువను కూడా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో కొంతసేపు ఆందోళన నెలకొంది. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా వారు పామును స్వాధీనం చేసుకున్నారు.
గాయపడిన స్వప్నకు డాక్టర్ కల్నెల్ మాచర్ల బిక్షపతి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం నుంచి బయటపడిందని వైద్యులు తెలిపారు.
అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కొండచిలువలు విషపూరితమైన పాములు కాకపోయినా, తమ శరీరంతో బిగించడం లేదా కాటు వేయడం వల్ల తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశం ఉంది. వర్షాకాలంలో మొక్కజొన్న చేలు, పొదలు, పొలాల్లో ఇవి ఎక్కువగా సంచరించే అవకాశం ఉండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.