అందరి టివి డిజిటల్ న్యూస్, వరంగల్ :వరంగల్ నగరంలో నకిలీ వైద్యులు, అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న క్లినిక్‌లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) ఉక్కుపాదం మోపింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ వైద్య సేవలను అరికట్టే లక్ష్యంతో టీజీఎంసీ ప్రత్యేక దాడులు నిర్వహించింది. పోలీసుల బందోబస్తుతో శివనగర్, కరిమాబాద్, కీర్తినగర్, కాజీపేట, ఊరుగొండ, ఊర్సు, ఫోర్ట్ వరంగల్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టగా, అనుమతులు లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తూ వైద్య సేవలు అందిస్తున్న పలువురు నకిలీ వైద్యులు బట్టబయలయ్యారు.
ఈ దాడుల్లో మొత్తం 16 మంది నకిలీ వైద్యులపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసేందుకు టీజీఎంసీ అధికారులు ఫిర్యాదులు అందజేశారు. నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ క్లినిక్‌లు నిర్వహించడం, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల పేరుతో ఇన్‌పేషెంట్ సేవలు అందించడం, బెడ్లు ఏర్పాటు చేసి రోగులను చేర్చుకోవడం, సెలైన్‌లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇవ్వడం, అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నట్లు ప్రజలను నమ్మించడం వంటి తీవ్ర ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
తనిఖీల సందర్భంగా అనేక కేంద్రాల్లో అపరిశుభ్రమైన వాతావరణంలో రోగులకు చికిత్సలు అందిస్తున్నట్లు, వాడిన సిరంజీలు, బయోమెడికల్ వ్యర్థాలను నిబంధనలకు విరుద్ధంగా సాధారణ మున్సిపల్ చెత్తలో పారవేస్తున్నట్లు గుర్తించారు. ఇది ప్రజారోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని అధికారులు హెచ్చరించారు. అనుమతి లేని మందులు నిల్వ చేయడం, వైద్య ప్రమాణాలు పాటించకుండా చికిత్సలు అందించడం, రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే విధంగా వ్యవహరించడం వంటి అంశాలను టీజీఎంసీ తీవ్రంగా పరిగణించింది.
కేసులు నమోదైన నకిలీ వైద్యులు
ఎ. రాములు (శివనగర్), కమలాకర్ (జయశ్రీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ – కీర్తినగర్), బండి రమేష్ (శ్వేత ఫస్ట్ ఎయిడ్ సెంటర్ – శివనగర్), వెంకటేశ్వర్లు (వెంకటేశ్వర క్లినిక్ – కీర్తినగర్), బాబురావు (శివనగర్), ఎ. రమేష్ (కావ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ – ఫోర్ట్ రోడ్), కృష్ణమూర్తి (కరిమాబాద్), టి. రాజమౌళి (విజయదుర్గ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ – కరిమాబాద్), శివశంకర్ (ఊర్సు), గడ్డం హరీష్ (ఊర్సు), గడ్డం శ్రీనివాస్ (ఊర్సు), ఎం. సిద్ధేశ్వర్ (జయలక్ష్మి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ – కరిమాబాద్), జి. రామకృష్ణ (ఫోర్ట్ వరంగల్), కుమారస్వామి (కాజీపేట), సుధాకర్ (కాజీపేట), జి. వెంకటరాములు (ఊరుగొండ).
రిజిస్ట్రేషన్ దుర్వినియోగంపై వైద్యురాలికి షోకాజ్...
కావ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు ఎ. రమేష్ తన క్లినిక్‌లో నమోదిత వైద్యురాలు డా. శ్రీహిత వైద్య రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను దుర్వినియోగం చేసినట్లు టీజీఎంసీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో డా. శ్రీహితకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. నమోదిత వైద్యులు తమ రిజిస్ట్రేషన్‌ను ఇతరులకు వినియోగించుకునేలా ఇవ్వడం తీవ్రమైన వృత్తిపరమైన ఉల్లంఘన అని మండలి స్పష్టం చేసింది.
పరారీలో రుద్ర భాస్కర్...
అబార్షన్లు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలీ వైద్యుడు రుద్ర భాస్కర్ తనిఖీల సమాచారం అందగానే పరారైనట్లు అధికారులు తెలిపారు. మరో నకిలీ వైద్యుడు లక్ష్మీనారాయణ కేసుల భయంతో తన క్లినిక్‌లోని బెడ్లు, వైద్య పరికరాలు, వాడిన సిరంజీలు, మందుల సీసాలను తొలగించినట్లు తనిఖీల్లో గుర్తించారు.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనున్న ప్రత్యేక దాడులు
నకిలీ వైద్యం, అనుమతి లేని క్లినిక్‌లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల పేరుతో చట్టవిరుద్ధంగా వైద్య సేవలు అందించడం, నమోదిత వైద్యుల పేర్లు, రిజిస్ట్రేషన్‌లను దుర్వినియోగం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తెలంగాణ వైద్య మండలి హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
ప్రజలు చికిత్స పొందే ముందు సంబంధిత వైద్యుడు తెలంగాణ వైద్య మండలి లేదా నేషనల్ మెడికల్ కమిషన్‌లో నమోదైన వైద్యుడేనా అని తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని టీజీఎంసీ సూచించింది. నకిలీ వైద్యుల సమాచారం తెలిసిన వెంటనే 9154382727 నంబర్‌కు లేదా సమీప జిల్లా వైద్యాధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరింది.