సోషల్ మీడియా వలలో మహిళలు... ఎస్ఐ అరెస్ట్!#AndariTVDigitalNews #BreakingNews #Hanumakonda #SubInspectorArrest #WomenSafety

Date: 2026-08-01
news-banner
హనుమకొండ | అందరి టివి డిజిటల్ న్యూస్
సోషల్ మీడియా వేదికగా మహిళలతో పరిచయాలు పెంచుకొని, వారిని నమ్మించి లైంగికంగా వేధించడం, బలవంతపు శారీరక సంబంధాలకు పాల్పడటం, బెదిరింపులు చేయడం వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సబ్ ఇన్‌స్పెక్టర్ **కదిరే శ్రీకాంత్ (38)**ను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసినట్లు సుబేదారి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన కదిరే శ్రీకాంత్ 2014 బ్యాచ్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్. వివాహితుడైన అతడు గతంలో పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించాడు. విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, సోషల్ మీడియాలో మహిళల ప్రొఫైళ్లను గుర్తించి వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతూ పరిచయం పెంచుకొని, నమ్మకం సంపాదించిన అనంతరం వారిని మానసికంగా, శారీరకంగా వేధించే విధానాన్ని అనుసరించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం, 2025లో ఓ మహిళతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పరుచుకున్న నిందితుడు తాను పోలీస్ అధికారినని చెప్పి ఆమె నమ్మకాన్ని పొందాడు. అనంతరం బాధితురాలి వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకొని వరంగల్‌లోని ఆమె నివాసానికి వెళ్లి బలవంతంగా శారీరక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. తర్వాత పలు సందర్భాల్లో హోటళ్లకు తీసుకెళ్లి ఆమెపై బలవంతపు లైంగిక దాడులు చేసినట్లు విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు.
అంతేకాకుండా, బాధితురాలి వద్ద తనకు నగ్న చిత్రాలు ఉన్నాయని అబద్ధం చెప్పి, విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరించడం, వీడియో కాల్స్ ద్వారా అసభ్యకరంగా వేధించడం, డబ్బులు డిమాండ్ చేయడం వంటి చర్యలకు కూడా పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, రాజకీయ నాయకుల మద్దతు తనకు ఉందని, ఎవరూ తనను ఏమీ చేయలేరని బెదిరించినట్లు విచారణలో వెల్లడైంది.
బాధితురాలు సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత తనను అరెస్ట్ చేస్తారనే భయంతో నిందితుడు విధులకు హాజరు కాకుండా గోవా, హైదరాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు ఉపయోగించిన సిమ్ కార్డులను ధ్వంసం చేసి, కేవలం వై-ఫై ద్వారానే కమ్యూనికేషన్ కొనసాగించినట్లు దర్యాప్తులో గుర్తించారు.
ఇదివరకు కూడా హైదరాబాద్‌కు చెందిన మరో యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి లైంగికంగా దోపిడీ చేసిన కేసులో జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై కేసు నమోదైనట్లు విచారణలో వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.
సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారంతో నిందితుడి ఆచూకీని గుర్తించిన పోలీసులు నిజామాబాద్‌లో అతడిని అదుపులోకి తీసుకొని సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, హనుమకొండ జిల్లా మూడవ అదనపు కోర్టు న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ మాట్లాడుతూ, సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలు పెంచుకునే విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి వేధింపులు, బెదిరింపులు ఎదురైనా ఆలస్యం చేయకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాలని సూచించారు.

Leave Your Comments