అందరి టీవీ డిజిటల్ న్యూస్/ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గురువారం బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నాయకులు శాంతియుత ధర్నా నిర్వహించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని, అందులో 80 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్‌ను ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రకటించాలని కోరారు. అలాగే సెంట్రలైజ్డ్ క్రూ లాబీ ఏర్పాటు, కొత్త రైలు సర్వీసులు, స్థానిక ఐటీఐ విద్యార్థులకు అప్రెంటిస్ అవకాశాలు, చిరు వ్యాపారులకు వెండింగ్ జోన్లు, ఫాతిమా బ్రిడ్జి నిర్మాణానికి సహకారం, రైల్వే స్టేడియం అభివృద్ధి వంటి పలు డిమాండ్లను కేంద్రం ముందుంచారు.
ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని, రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధులు సాధించడంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు విఫలమయ్యారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సూచనల మేరకు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.