అందరి టివి డిజిటల్ న్యూస్|హైదరాబాద్|నర్సంపేట: ఇటీవల గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా ఆసుపత్రికి చేరుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు అందుతున్న వైద్య చికిత్స, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి వారితో మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ప్రజల మధ్యకు తిరిగి రావాలని వారు ఆకాంక్షించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానులు, కార్యకర్తలు, నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.