అందరి టివి డిజిటల్ న్యూస్|మంగపేట మండలం | ములుగు జిల్లా: మంగపేట మండలం కోమటిపల్లి అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి భారీ సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. వర్షంతో పాటు టోర్నడో తరహాలో వీచిన సుడిగాలుల ధాటికి అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. కొన్ని చెట్లు రోడ్డుపై కూడా విరిగి పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.రెండేళ్ల క్రితం మేడారం అటవీ ప్రాంతంలో సంభవించిన సుడిగాలులను తలపించేలా ఈసారి కూడా భారీ గాలులు వీచినట్లు స్థానికులు చెబుతున్నారు. సుడిగాలుల ప్రభావంతో అటవీ ప్రాంతంలో పెద్ద మొత్తంలో చెట్లు కూలిపోయినట్లు సమాచారం.
రాత్రి సమయం కావడంతో పాటు వర్షం కొనసాగుతుండటంతో ప్రస్తుతం ఎంతమేర నష్టం జరిగిందో పూర్తిస్థాయిలో అంచనా వేయలేమని అటవీ శాఖ అధికారులు తెలిపారు. రేపు ఉదయం అటవీ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం కూలిన చెట్లు, జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.
ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 50 నుంచి 100 చెట్లు దెబ్బతిని ఉండొచ్చని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.