📺
అందరి టివి డిజిటల్ న్యూస్|జనగామలో మత్తు పదార్థాల విక్రేతలపై పోలీసుల విరుచుకుపాటు.. డాగ్ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు:జనగామ జిల్లా కేంద్రంలో నిషేధిత మత్తు పదార్థాలు, గుట్కా విక్రయాలపై పోలీసులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు ఉక్కుపాదం మోపారు. యువత, విద్యార్థుల భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్న మత్తు పదార్థాల రవాణా, విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా పట్టణంలో శనివారం ప్రత్యేక తనిఖీ కార్యక్రమం నిర్వహించారు.షాపుల్లో తనిఖీలు.. భారీగా స్వాధీనం:
నార్కోటిక్స్ విభాగానికి చెందిన ప్రత్యేక బృందాలు పట్టణంలోని పలు వ్యాపార సముదాయాలు, పాన్ షాప్‌లు, కిరాణా దుకాణాలపై ఉన్నఫలంగా దాడులు నిర్వహించాయి. ఈ సోదాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సిగరెట్లు, గుట్కా, అంబర్ తో పాటు ఇతర నిషేధిత పొగాకు, మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
డాగ్ స్క్వాడ్‌తో అణువణువూ జల్లెడ:
సాధారణ తనిఖీలతో పాటు అనుమానాస్పద ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలలో డాగ్ స్క్వాడ్ సాయంతో ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టడం విశేషం. రహస్యంగా దాచి ఉంచిన మత్తు పదార్థాలను నిమిషాల వ్యవధిలోనే డాగ్ స్క్వాడ్ సహాయంతో అధికారులు గుర్తించి సీజ్ చేశారు.
విద్యా సంస్థల వద్ద విక్రయిస్తే కఠిన చర్యలు — నార్కోటిక్స్ ఎస్ఐ సమ్మిరెడ్డి:
ఈ సందర్భంగా నార్కోటిక్స్ ఎస్ఐ సమ్మిరెడ్డి మాట్లాడుతూ.. విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి పొగాకు, మత్తు పదార్థాలు విక్రయించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. చిన్నపాటి వ్యాపారాల పేరుతో విద్యార్థులకు మత్తు పదార్థాలు అలవాటు చేసేందుకు యత్నిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
సమాజంలో మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు ఈ తరహా ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన తెలియజేశారు. మత్తు పదార్థాల విక్రయాలకు సంబంధించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.