నర్సంపేట
(అందరి టీవి డిజిటల్ న్యూస్):వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద శనివారం నర్సంపేట నియోజకవర్గంలో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల, బీఎస్సీ నర్సింగ్ కళాశాలతో పాటు జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కాలేజీ మరియు నర్సింగ్ కళాశాల భవనాల నిర్మాణ పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించి, పనుల పురోగతిపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల్లో ఎటువంటి రాజీ పడకుండా, నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
విద్యార్థుల సౌకర్యార్థం భవనాల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని గుత్తేదారులకు, అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
కళాశాలలో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, తరగతి గదులు, ల్యాబ్లు మరియు హాస్టల్ సౌకర్యాల గురించి అధికారులతో చర్చించారు.
పెండింగ్లో ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, అత్యంత త్వరలో ఆపరేషన్ థియేటర్ను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు.తద్వారా రోగులకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ (ఇన్చార్జ్) డా. ఎస్. లక్ష్మీనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్ (ఇన్చార్జ్) డా. ఎం. దామోదారి బాయి, వైస్ ప్రిన్సిపాల్ (అకాడెమిక్స్) డా. కె. శ్రీదేవి, బీఎస్సీ నర్సింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ చంద్రకళ, టీఎస్ఎంఐడీసీ (TSMIDC) సివిల్ ఇంజనీర్ నరేష్, విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) వేణు, వైద్యులు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.