చీర కోసం మొదలైన గొడవ.. భర్త హత్యకు దారితీసింది!#AndariTV #AndariTVDigitalNews #BreakingNews #MaharashtraNews

Date: 2026-07-23
news-banner
అందరి టీవీ డిజిటల్ న్యూస్ | వెబ్ డెస్క్
చీర కొనివ్వలేదని భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
సంసారంలో చిన్నపాటి గొడవలు సహజమే. కానీ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఓ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. మహారాష్ట్రలోని బద్లాపూర్ ఈస్ట్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. శిర్గావ్‌లో హరేరామ్ సింగ్ తన భార్య సునీతా దేవి, ఏడేళ్ల కుమారుడితో కలిసి నివసిస్తున్నారు.
కొత్త చీర కొనివ్వాలని భార్య కోరగా.. భర్త నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన భార్య కిచెన్‌లోని ప్రెషర్ కుక్కర్‌తో భర్త తలపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
భర్త అంగవైకల్యం కారణంగా మంచానికే పరిమితమై ఉండటంతో దాడిని అడ్డుకోలేకపోయినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం నిందితురాలే పోలీసులకు సమాచారం ఇచ్చి.. హత్యతో తనకు సంబంధం లేనట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు.
అయితే, ఘటన సమయంలో ఇంట్లోనే ఉన్న ఏడేళ్ల కుమారుడిని పోలీసులు విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. బాలుడి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు సునీతా దేవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
దంపతుల మధ్య గతంలోనూ తరచూ గొడవలు జరిగేవని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ హత్యకు కేవలం చీర కొనివ్వకపోవడమే కారణమా? లేక కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు వంటి ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒకవైపు భర్త ప్రాణాలు కోల్పోగా.. మరోవైపు భార్య జైలు పాలైంది. ఈ ఘటనతో ఏడేళ్ల చిన్నారి పరిస్థితి విషాదకరంగా మారింది.

Leave Your Comments