AndariTV dIGITAL / Desk Ap News /
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి స్టేషన్ సమీపంలో శనివారం అర్ధరాత్రి టాటా–ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ రైలులో తీవ్ర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం–దువ్వాడ మీదుగా ఎర్నాకులం వెళ్తున్న ఈ రైలులోని ఏసీ కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
రైలు ఎలమంచిలి స్టేషన్‌కు చేరువవుతున్న సమయంలో B1, M2 అనే రెండు ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కొద్ది నిమిషాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చి, రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన లోకో పైలట్ వెంటనే రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ దుర్ఘటనలో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ (సుమారు 70 ఏళ్లు) అనే ప్రయాణికుడు బోగీలోనే చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. ఘటన సమయంలో బోగీల్లో ఉన్న మిగతా ప్రయాణికులు ప్రాణభయంతో కిటికీలు, తలుపుల ద్వారా బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దగ్ధమైన బోగీలను రైలు నుంచి వేరు చేసి, మిగిలిన బోగీలతో రైలును ఎర్నాకులం వైపు కొనసాగించారు.
ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబానికి తగిన సహాయం అందిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో రైల్వే ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.