అందరి టీవీ డిజిటల్ న్యూస్: నర్సంపేట: విద్యార్థులకు ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) నిర్వహణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నర్సంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ మాట్లాడుతూ, ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో సీసం (లెడ్) వంటి హానికరమైన రసాయన పదార్థాలు ఉంటాయని తెలిపారు.పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను విచ్చలవిడిగా బయట పారవేయడం, కాల్చివేయడం వల్ల వాటిలోని హానికర పదార్థాలు భూమిని, వాతావరణాన్ని కలుషితం చేస్తాయని వివరించారు. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగాన్ని అవసరమైన మేరకు పరిమితం చేయాలని, పాడైపోయిన ఎలక్ట్రానిక్ పరికరాలను నిర్లక్ష్యంగా పారవేయకుండా వాటిని సేకరించి, తగిన విధంగా రీసైక్లింగ్ చేయాలని సూచించారు. ఈ విధానాల ద్వారా ఈ-వేస్ట్ నిర్వహణను సమర్థవంతంగా చేపట్టి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఈ-వేస్ట్పై క్విజ్ పోటీ నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.