కాంగ్రెస్ 1000 రోజుల పాలన.. 1000 అబద్ధాల దగా పాలన!#AndariTVDigitalNews #Hanamkonda #TelanganaPolitics #BRS #VinayBhaskar #BoinapallyVinodKumar

Date: 2026-09-02
news-banner
అందరి టీవీ డిజిటల్ న్యూస్:హనుమకొండ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలులో విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన ప్రజాపాలన కాదని, “1000 అబద్ధాల దగా పాలన” అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపిన మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్తో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
హనుమకొండలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారని నాయకులు ఆరోపించారు. ముందస్తు అనుమతి తీసుకున్న కార్యక్రమాన్ని అడ్డుకోవడం, నిన్న అనుమతి ఇచ్చిన పోలీసులే నేడు అరెస్టులకు పాల్పడటం సరికాదని విమర్శించారు.
ఆదాలత్ సర్కిల్ వద్ద మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌ను అక్రమంగా అరెస్టు చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అరెస్టులను అధిగమించి సుబేదారి జంక్షన్‌లో పార్టీ కార్యకర్తలు నిరసన కొనసాగించారని తెలిపారు.
అక్రమంగా అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించిన వినయ్ భాస్కర్‌కు సంఘీభావం తెలిపేందుకు మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో ప్రజా పీడిత పాలనను తలపిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో జరిగిన వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఎండగడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
ప్రజల పక్షాన శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అక్రమ అరెస్టులతో అడ్డుకోలేరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి కనిపించడం లేదని, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల ముందు ఛార్జ్‌షీట్ ఉంచుతున్నామని పేర్కొన్నారు.
ఆరు గ్యారంటీల పేరుతో బాండ్ పేపర్లు రాసిచ్చి, వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని ప్రజలను నమ్మించిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజులు గడుస్తున్నా హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధి వెనుకబడుతోందని వినయ్ భాస్కర్ విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేయడం సహజమైన ప్రక్రియ అని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రశ్నించే గొంతులను అరెస్టులతో అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని, శాంతియుత నిరసనలకు అనుమతి ఇవ్వాలని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు మరియు 420 హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

Leave Your Comments