పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, మానసిక ఉత్సాహానికి క్రీడలు అవసరం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు#AndariTV #KRNagaraju #WardhannapetMLA #Mamnoor #TGSPSports #PoliceSports

Date: 2026-09-01
news-banner
 అందరి టివి డిజిటల్ న్యూస్: మామునూరు 4వ బెటాలియన్‌లో ఇంటర్-కంపెనీ స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు..
వరంగల్: క్రీడలు మానసిక, శారీరక వికాసానికి ఎంతో దోహదపడతాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు అన్నారు.
మంగళవారం మామునూరు 4వ బెటాలియన్ టీజీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్-కంపెనీ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం క్రీడా పోటీలను అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... విధి నిర్వహణలో పోలీస్ సిబ్బంది నిరంతరం తీరిక లేకుండా సేవలందిస్తున్నారని తెలిపారు. వారి మానసిక ఉల్లాసం, ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
క్రీడలు ఒక రకమైన ధ్యానం వంటివని, అవి ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యాన్ని, పనితీరును మెరుగుపరుస్తాయని ఎమ్మెల్యే అన్నారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణ, అంకితభావం, ధైర్యసాహసాలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, అదే స్ఫూర్తితో క్రమశిక్షణతో కూడిన క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
క్రీడలు కేవలం గెలుపు, ఓటముల కోసమే కాదని, వాటి ద్వారా క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. పోలీస్ సిబ్బందికి శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం కూడా ఎంతో అవసరమన్నారు.
తాను చిన్నతనంలో ఇదే క్రీడా మైదానంలో పోలీస్ సిబ్బందిని చూసి స్ఫూర్తి పొందానని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గుర్తుచేసుకున్నారు. ఆ స్ఫూర్తితోనే పోలీస్ కమిషనర్‌గా సేవలందించి పదవీ విరమణ చేసిన అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు తెలిపారు.
పోలీస్ కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు లేదా ఇబ్బందులు ఉన్నా వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని స్పష్టం చేశారు.అనంతరం పోలీస్ అధికారులతో కలిసి బెటాలియన్ గ్రౌండ్‌లో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ఎన్‌వీ సత్య శ్రీనివాస్ రావు, అసిస్టెంట్ కమాండెంట్లు రాజేందర్, బాలయ్య, డివిజన్ అధ్యక్షుడు రాజ్ కుమార్, మాజీ కార్పొరేటర్ అరుణ విట్టల్, మాజీ డివిజన్ అధ్యక్షుడు చింత ప్రకాష్, సీనియర్ నాయకులు బాబురావు, కొమురెల్లి యాదవ్, శివకుమార్, వాడేపల్లి ప్రకాష్, అరుణ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave Your Comments