హైదరాబాద్ (అందరిటివి న్యూస్): ఐటీ హబ్ మాదాపూర్‌లో అర్ధరాత్రి జరిగిన ఒక దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. ప్రేమ పేరుతో ఇద్దరు యువతులను (అక్కాచెల్లెళ్లను) వేధిస్తున్నాడనే ఆగ్రహంతో.. వారి తండ్రి, మరో బంధువు కలిసి ఓ యువకుడిని అందరూ చూస్తుండగానే కత్తులతో నరికి చంపారు.
పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి:
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సీనపల్లి భాస్కర్ (30), మాదాపూర్‌లోని ‘శ్రీ శ్రీనోమా’ హోటల్‌లో కుక్‌గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. భాస్కర్ కొంతకాలంగా వరంగల్‌కు చెందిన ఇద్దరు సోదరీమణులను ప్రేమ పేరుతో వెంబడిస్తూ, ఫోన్ సందేశాల ద్వారా వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులపై గతంలోనే వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా నమోదైంది. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ భాస్కర్ ప్రవర్తనలో మార్పు రాలేదని తెలుస్తోంది.
"దమ్ముంటే హైదరాబాద్ రండి" అంటూ సవాల్..
ఈ వేధింపుల విషయంపై యువతుల తండ్రి తమ్మెడబోయిన రాజు గతంలో భాస్కర్‌ను ఫోన్ చేసి మందలించాడు. అయితే, భాస్కర్ వెనక్కి తగ్గకుండా.. "దమ్ముంటే హైదరాబాద్‌కు రండి.. చూసుకుందాం" అంటూ రాజుకు సవాల్ విసిరినట్లు పోలీసులు తెలిపారు. భాస్కర్ ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజు, తన బావమరిది మారం కుమారస్వామితో కలిసి వరంగల్ నుండి హైదరాబాద్‌కు చేరుకున్నాడు.
అర్ధరాత్రి వేళ ఘాతుకం..
నిన్న అర్ధరాత్రి 11:45 గంటల సమయంలో మాదాపూర్ అరుణోదయ కాలనీలోని ప్రముఖ రామేశ్వరం కేఫే ఎదుట భాస్కర్ కనిపించడంతో.. రాజు, కుమారస్వామి ఒక్కసారిగా కత్తులు, కర్రలతో అతడిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో భాస్కర్ రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితులు:
హత్య జరిగిన వెంటనే స్థానికులు డయల్-100 ద్వారా సమాచారం అందించడంతో మాదాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, హత్యకు పాల్పడిన ప్రధాన నిందితులు తమ్మెడబోయిన రాజు, మారం కుమారస్వామి ఇద్దరూ నేరుగా మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.