అందరి టీవీ న్యూస్ డెస్క్| ములుగు జిల్లా కేంద్రం: జిల్లాలో నేరాల నియంత్రణలో ఎలాంటి రాజీ పడకుండా సమర్థవంతంగా పనిచేయాలని పోలీసు అధికారులకు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ స్పష్టం చేశారు.
మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని, దొంగతనాలు మరియు గంజాయి కేసుల దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
హైవేకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో పోలీసు గస్తీని పెంచడంతో పాటు, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు గ్రామస్థాయిలో బలమైన ఇన్ఫార్మర్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని, క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. యువత గంజాయి వినియోగానికి అలవాటు పడుతున్న ప్రాంతాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే కోర్టు విచారణలో ఉన్న కేసుల పురోగతిపై నిరంతరం దృష్టి సారించి, బాధితులకు త్వరిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, డీసీఆర్‌బీ డీఎస్పీ కిషోర్ కుమార్, ములుగు డీఎస్పీ ఎన్. రవీందర్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.