రంగుల నాలుక.. రోగాల సూచిక!

Date: 2024-06-26
news-banner
AndariTv Digital ,Health Special 

మనం జబ్బుపడినప్పుడు డాక్టర్‌ను సంప్రదిస్తాం. మనం వెళ్లీ వెళ్లగానే ఆయన మనల్ని నోరు తెరవమంటాడు. నాలుకను పరిశీలిస్తాడు. మరి ఎప్పుడైనా మన నాలుక మన ఆరోగ్య వివరాలను వెల్లడిస్తుందనే విషయం గురించి ఆలోచించారా? అందువల్ల, నాలుక రంగులో మార్పులను గమనిస్తూ ఉండాలి. అవి వివిధ వ్యాధులకు సూచికలు కావొచ్చు.
నాలుక మీద ఉండే రంగు మన శరీర ఆరోగ్యం గురించి కీలకమైన రహస్యాలను తెలియజేస్తుంది. అంతేకాదు కొన్ని ప్రత్యేకమైన వ్యాధులకు ఆయా రంగులు సంకేతాలుగా నిలుస్తాయి. ఆరోగ్యకరమైన నాలుక గులాబీ రంగులో, పల్చటి తెల్లరంగు పొరతో ఉంటుంది. ఈ రెండిటిలో ఎలాంటి తేడాలు వచ్చినా మనకు ఏవో ఆరోగ్య సమస్యలు ఉన్నట్టుగానే భావించాలి.

నలుపురంగు: కొన్ని సందర్భాల్లో నాలుక నలుపు రంగులోకి మారిపోతుంది. ఇది క్యాన్సర్‌ లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు సంకేతం కావొచ్చు. ఇంకా ఫంగస్‌, అల్సర్‌ లాంటి రుగ్మతల లక్షణం కూడా అయ్యుండొచ్చు.

తెలుపు రంగు: నాలుక తెలుపు రంగులో కనిపిస్తున్నదంటే శరీరంలో డీహైడ్రేషన్‌ పెరిగే అవకాశాలు ఉన్నట్టు. ఇది మాత్రమే కాకుండా ల్యూకోప్లేకియా (నోట్లో తెల్లటి మచ్చలు ఉంటాయి. నోటి క్యాన్సర్‌ ముప్పు పొంచి ఉంటుంది) లాంటి తీవ్రమైన వ్యాధులకు సంకేతం కూడా కావొచ్చు.

పసుపు రంగు: నాలుక పసుపు రంగులో ఉందంటే మనం ఆహారం అరుగుదల మెరుగుపడటం మీద దృష్టి సారించాలని అర్థం. అంతేకాకుండా నాలుక మీద బ్యాక్టీరియా పేరుకుపోయినా కూడా పచ్చగా మారిపోతుంది. ఒక్కోసారి పసుపు రంగు నాలుక కాలేయ ఆరోగ్య సమస్యలకు సంబంధించిన సంకేతం కూడా అయ్యుండొచ్చు.

ఎరుపు రంగు: విటమిన్‌ బి, ఐరన్‌ లోపం ఉంటే నాలుక ఎరుపు రంగులోకి మారుతుంది. ఇంకా ఫ్లూ, జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్ల లక్షణం కూడా కావొచ్చు. మీ నాలుక ఎరుపు రంగులోకి మారిన విషయం గుర్తిస్తే, వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. నాలుక రంగును బట్టి.. మనకేదో జబ్బు వచ్చిందని గాబరా పడిపోవద్దు. రంగులో గుర్తించదగ్గ మార్పు కనిపిస్తే మాత్రం.. వెంటనే వైద్యుణ్ని సంప్రదిస్తే మంచిది.

image

Leave Your Comments