అందరి టీవీ డిజిటల్ న్యూస్ – నర్సంపేట: పట్టణంలో బంజారా సమాజం ఆధ్వర్యంలో తీజ్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే తీజ్ వేడుకల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.తీజ్ పండుగ సందర్భంగా బంజారా సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. యువతులు సంప్రదాయ పద్ధతుల్లో పూజలు నిర్వహించి, కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పండుగ ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా బానోతు లక్ష్మణ్ నాయక్, కొర్ర శోభన్ బాబు (టౌన్ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ), మతృ రాథోడ్ (13వ వార్డు కౌన్సిలర్), బానోతు నవీన్ నాయక్ (16వ వార్డు అధ్యక్షులు), వాసు నాయక్, జగన్ నాయక్, కొర్ర క్రాంతికుమార్, ఉదయ్ సింగ్, వెంకన్న, సుభాష్, సురేష్ తదితరులు పాల్గొని తీజ్ వేడుకల్లో సందడి చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బంజారా సమాజం తరతరాలుగా కొనసాగిస్తున్న తీజ్ పండుగ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఆధునిక కాలంలోనూ యువత తమ పూర్వీకుల ఆచారాలను కొనసాగించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి పండుగల ద్వారా బంజారా సంస్కృతి, సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు చేరుతాయని తెలిపారు.
పండుగ సందర్భంగా నిర్వహించిన సంప్రదాయ పాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో నర్సంపేటలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో పాల్గొన్న వారు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ తీజ్ పండుగను ఘనంగా ముగించారు.