కాజీపేట వైయస్సార్ నగర్‌లో గుడిసెల పరిశీలన.. పేదలకు దాస్యం వినయ్ భాస్కర్ భరోసా..

Date: 2026-08-25
news-banner
అందరి టివి డిజిటల్ న్యూస్ కాజీపేట: వైయస్సార్ నగర్‌లోని గుడిసెలను ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్‌ఎస్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ పరిశీలించారు. గుడిసెవాసులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కొందరు షాపూర్ ఇరాని కుటుంబ సభ్యులమంటూ వచ్చి ఈ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. 2005లో పేదలు ఇక్కడ గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.
కోర్టు కేసులో ఉన్న భూమిపై మూడు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం కాంప్లెక్స్ నిర్మాణానికి ఎన్‌ఓసీ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. దొంగ పత్రాలు సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ భూమి ముమ్మాటికీ ప్రభుత్వ భూమేనని పేర్కొన్నారు.
ఇక్కడ నివసిస్తున్న పేదలకు ఇంటి నంబర్లు, ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఉన్నాయని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి గుడిసెవాసులను భయపెడుతున్నారని ఆరోపించారు. ఈ భూమిపై కోట్ల రూపాయలు చేతులు మారాయని, కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ భూమిపై కన్నేశారని విమర్శించారు.
ఎన్నికల సమయంలో రైల్వే రిటైర్డ్ ఉద్యోగుల కోసం భూమి కేటాయించిన సందర్భంలో తమపై కేసులు నమోదు చేశారని, అనంతరం కోర్టు ఆ కేసులను కొట్టివేసిందని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.
ప్రభుత్వ భూమిపై రాబందుల్లా కన్నేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా నిర్మిస్తున్న కాంప్లెక్స్‌కు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ఎలా ఎన్‌ఓసీ ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు చేసిన వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.
పేదల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ అంశాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించాలని డిమాండ్ చేశారు.
అనంతరం రైల్వే రిటైర్డ్ ఎంప్లాయిస్‌తో దాస్యం వినయ్ భాస్కర్ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Leave Your Comments