అందరి టీవీ డిజిటల్ జిల్లా ప్రతినిధి
సూర్యాపేట, ఆగస్టు 26:
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు–కంటైనర్ ఢీ
పలువురికి తీవ్ర గాయాలు.. సహాయక చర్యలు ముమ్మరం
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టింది.
ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడగా, తాజా స్థానిక నివేదిక ప్రకారం మృతుల సంఖ్య ఆరుగురికి చేరింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు బస్సులో ఇరుక్కుపోయి ఆర్తనాదాలు చేయడంతో స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం కారణంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.