అందరి టివి డిజిటల్ న్యూస్ : ప్రత్యేక కథనంహైదరాబాద్ మహానగరంలో అవినీతి అధికారులు మరోసారి ఏసీబీ (ACB) వలకు చిక్కారు. రక్షక భటులుగా ఉంటూ ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులే.. అందినకాడికి దండుకుంటూ కటకటాల పాలయ్యారు. చందానగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ), ఓ కానిస్టేబుల్ ఏకంగా రూ. 75 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం నగర పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
అసలేం జరిగిందంటే..
రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఒక కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేయడానికి, అలాగే కోర్టులో నిందితులపై ఛార్జ్ షీట్ (Charge Sheet) దాఖలు చేయడానికి ఎస్ఐ బందేల బల్ రాజ్ (AO-1), కానిస్టేబుల్ బి. రాఘవేంద్ర (AO-2) ఫిర్యాదుదారుడిని ఆశ్రయించారు. తమకు భారీగా ముడుపులు చెల్లిస్తేనే పని ముందుకు సాగుతుందని తేల్చి చెబుతూ రూ. 75,000 లంచం డిమాండ్ చేశారు.
పక్కా స్కెచ్‌తో పట్టుకున్న ఏసీబీ.
పోలీసుల వేధింపులు భరించలేని బాధితుడు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో వల పన్నారు. ఫిర్యాదుదారుడి నుంచి ఎస్‌ఐ బల్ రాజ్ సూచన మేరకు లంచం తీసుకుంటుండగా అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. ఆయన ఆఫీసు టేబుల్ డ్రాలో దాచిన రూ. 75,000 లంచం మొత్తాన్ని అధికారులు సీజ్ చేశారు.
యూపీఐ ద్వారా కూడా వసూళ్లు!
పోలీసుల అవినీతి ఈ రూ. 75 వేలకే పరిమితం కాలేదు. ఇదివరకే ఎస్‌ఐ బల్ రాజ్ బాధితుడి నుంచి రూ. 20,000 నగదును లంచంగా స్వీకరించినట్లు ఏసీబీ విచారణలో తేలింది. అలాగే, కానిస్టేబుల్ రాఘవేంద్ర ఏకంగా డిజిటల్ పేమెంట్స్ ద్వారా అక్రమాలకు పాల్పడ్డాడు. యూపీఐ (UPI) ద్వారా రూ. 10,000 చొప్పున అక్రమంగా డబ్బులు వసూలు చేసి ప్రయోజనం పొందినట్లు అధికారులు నిర్ధారించారు.
నిందితుల అరెస్ట్
ఆధారాలతో సహా పట్టుబడిన ఎస్ఐ, కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు తక్షణమే అరెస్ట్ చేశారు. వారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం హైదరాబాద్‌లోని ఎస్‌పిఈ & ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు (Special Court for SPE & ACB Cases)లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నట్లు వెల్లడించారు.
ప్రజలకు ఏసీబీ అధికారుల కీలక విజ్ఞప్తి..
ప్రభుత్వ కార్యాలయాల్లో గానీ, పోలీస్ స్టేషన్లలో గానీ ఎవరైనా అధికారులు తమ పనులు చేయడానికి లంచం అడిగితే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడొద్దు. వెంటనే ఏసీబీని సంప్రదించండి.
టోల్ ఫ్రీ నంబర్: 1064
వాట్సాప్ నంబర్: 9440446106
సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు భరోసా ఇచ్చారు.