శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై పెద్దపులి ప్రత్యక్షం
నాగర్ కర్నూల్:అందరి టీవీ (ATV) డిజిటల్ న్యూస్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై శనివారం ఒక పెద్దపులి ప్రత్యక్షమైంది. మున్ననూరు నుంచి శ్రీశైలం, హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనదారులకు నల్లమల అటవీ ప్రాంతంలోని ఘాట్ రోడ్డుపై ఈ పులి రోడ్డు దాటుతూ కనిపించింది.
రోడ్డుపై పులి స్వేచ్ఛగా సంచరిస్తుండటాన్ని గమనించిన ప్రయాణికులు, పర్యాటకులు వాహనాలను నిలిపివేసి, తమ సెల్‌ఫోన్లలో ఆ దృశ్యాలను రికార్డ్ చేశారు. ప్రయాణికులు కొందరు భయాందోళనకు గురికాగా, మరికొందరు పులిని అంత దగ్గరగా చూడటంతో ఆశ్చర్యానికి లోనయ్యారు.
అటవీ శాఖ అధికారుల హెచ్చరిక:
శ్రీశైలం హైవేపై రాత్రి సమయాల్లో ప్రయాణించే భక్తులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. వన్యప్రాణులు కనిపించినప్పుడు వాహనాల నుంచి కిందకు దిగవద్దని, హారన్లు కొట్టడం లేదా ఫ్లాష్ లైట్లతో వాటిని ఇబ్బంది పెట్టకుండా సురక్షిత దూరం పాటించాలని హెచ్చరించారు.