అందరి టీవీ డిజిటల్ / ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి
పత్తి కొనుగోళ్లలో దళారులు చేస్తున్న మాయ ఇది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఇటీవల కొందరు రైతులు ఈ మోసాన్ని గుర్తించారు. చిన్న రైతులు రవాణా వ్యయప్రయాసలు భరిం చలేక పత్తిని గ్రామాల్లోనే దళారులకు విక్రయిస్తున్నారు.
మార్కెట్ కంటే క్వింటాపై రూ.100- 200 ఎక్కువ చెల్లిస్తామంటూ దళారులు చెబుతుండడం మరో కారణం.
రైతుల ఇళ్లు, పొలాల వద్దకే దళారులు వాహనంలో యంత్రాలను తీసుకెళ్లి పంటను తూకం వేస్తారు. ఆ యంత్రంలో ఒక చిప్ను అమరుస్తున్నారు.
50-100 మీటర్ల దూరం నుంచి రిమోట్ తో ఈ చిప్ను నియంత్రించవచ్చు.
రిమోట్ లోని బటన్ ను ఒకసారి నొక్కితే.. 5 కిలోలు, రెండుసార్లు నొక్కితే 10 కిలోలు తగ్గేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మరికొందరు యంత్రాల్లో ముందుగానే 5 నుంచి 10 కిలోలు తగ్గేలా సర్దుబాటు చేసుకొని మోసగిస్తున్నారు.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లికి చెందిన పత్తి రైతు కుమారస్వామికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. '40-45 కిలోలు తూగాల్సిన పత్తి బస్తాను కాంటా పై పెడితే, 35 కిలోలే చూపించడంతో అను మానం వచ్చింది.
అదే యంత్రంపై 90 కిలోల బరువున్న వ్యక్తిని నిలబెట్టగా.. 68 కిలోలే చూపింది. ఓ వ్యక్తి దూరంగా నిలబడి, జేబులో ఉన్న రిమోట్తో బరువును నియంత్రిస్తున్నట్లు గమనించి.. వారిని పోలీసులకు అప్పగించాం' అని ఆయన తెలిపారు.