కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌..!

Date: 2024-10-27
news-banner
అందరి టీవీ /డిజిటల్ / డెస్క్ ప్రత్యేకం 

- నిరసనలను సహించం: డీజీపీ జితేందర్‌
- వెట్టి నుంచి మాకు విముక్తి కల్పించండి..
- బెటాలియన్లలో మట్టి పనులు చేయిస్తున్నారు
- వాగులో ఇసుక, క్యాంపులో పైపులు మోస్తున్నాం
- ఎస్పీ కాళ్లు మొక్కి.. కానిస్టేబుళ్ల కంటతడి
- సిరిసిల్ల, హనుమకొండ, నల్లగొండలో నిరసన

రాష్ట్రంలోని వివిధ బెటాలియన్లలో జరుగుతున్న ఆందోళనలను పోలీసు శాఖ సీరియ్‌సగా తీసుకుంది. సెలవుల విషయంలో ఇదివరకు ఉన్న పద్ధతినే అమలు చేస్తామని ప్రకటించినా.. నిరసనలు ఆగకపోవడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌ ఉద్యోగంలో ఉండి ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్న వారు, న్యూస్‌ ఛానెల్స్‌కి ఇంటర్వ్యూలు ఇస్తూ, సోషల్‌ మీడియాలో పోస్టింగ్స్‌ చేస్తూ.. ఆందోళనలను ప్రేరేపిస్తున్న వారిని పోలీసు శాఖ గుర్తించింది. తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడుతున్న 39 మందిని గుర్తించి సస్పెండ్‌ చేసింది. వీరిలో కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు ఉన్నారు. పోలీస్‌ యూనిఫాం క్రమశిక్షణకు మారుపేరని, యూనిఫాం సర్వీ్‌సలో ఉండి నిరసనలకు దిగడం సరికాదని డీజీపీ జితేందర్‌ అన్నారు.


టీజీఎస్పీ విధులు కొన్ని దశాబ్దాల నుంచి అమల్లో ఉన్నాయని తెలిపారు. పోలీస్‌ నియామక సమయంలోనే కానిస్టేబుళ్లను సివిల్‌, ఏఆర్‌, స్పెషల్‌ పోలీ్‌సగా ఎంపిక చేస్తారని వివరించారు. విభాగాల వారీగా సిబ్బంది పనితీరు ఉంటుందన్నారు. తెలంగాణ పోలీ్‌సలకు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వేతనాలు ఎక్కువగానే ఉన్నాయని, ఆరోగ్య భద్రత, ఇతర అనేక సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయని డీజీపీ చెప్పారు. ఏవైనా సమస్యలు ఉంటే బెటాలియన్లలో నిర్వహించే ‘దర్బార్‌’లో ఉన్నతాధికారుల దృష్టికి తేవాలన్నారు. యూనిఫాం సర్వీస్‌ సిబ్బంది ఆందోళనలు నిర్వహించడం తీవ్రమైన విషయమని తెలిపారు. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలను పోలీస్‌ శాఖ సానుభూతితో పరిశీలిస్తుందని డీజీపీ తెలిపారు. ఆందోళనలకు దిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


పోలీస్‌ డ్యూటీలకు సంబంధం లేకుండా వాగులో ఇసుక తేవడం, మిషన్‌ భగీరథ పైపులు తేవడం వంటివి చేయిస్తున్నారు’’ అని సిరిసిల్లలోని 17వ పోలీస్‌ బెటాలియన్‌ కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. బెటాలియన్‌లో తమతో చేయిస్తున్న పనుల వీడియోలను చూపించారు. శనివారం బెటాలియన్‌లో కమాండెంట్‌ పోలీస్‌ కార్యాలయం ఎదుట కానిస్టేబుళ్లు ధర్నా చేశారు. తమిళనాడు, కర్ణాటకలో ఉన్న పోలీస్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రా అధికారులు తమపై పెత్తనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.


విషయం తెలుసుకున్న ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ బెటాలియన్‌కు చేరుకుని కానిస్టేబుళ్ల ఆవేదన విన్నారు. ఈ క్రమంలో పోలీస్‌ కానిస్టేబుళ్లు ఎస్పీ కాళ్ల మీదపడి వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలని, ఒకే పోలీస్‌ విధానం అమలు చేయాలని కోరారు. ఎస్పీ ఎదుట పోలీసులు కంటతడి పెట్టడం అందరినీ కలచివేసింది. మరోవైపు, హనుమకొండ జిల్లా మామునూరులోని టీజీఎస్పీ 4వ బెటాలియన్‌కు చెందిన 260 మంది బెటాలియన్‌ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ ప్రకారం ఒకే రాష్ట్రం, ఒకే పోలీస్‌ వ్యవస్థ అమలు చేయాలని కోరారు. వరంగల్‌ సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. నల్లగొండ సమీపంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఒక రాష్ట్రం.. ఒకే పోలీస్‌’ నినాదంతో తెలంగాణ స్పెషల్‌ పోలీసు కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంచిర్యాల జిల్లా గుడిపేటలోని 13వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు శనివారం మంచిర్యాలలో రాస్తారోకో చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా యాపల్‌గూడలోని రెండో బెటాలియన్‌ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ చౌరస్తాలో బైఠాయించారు. కొత్తగూడెం జిల్లా చాతకొండకు చెందిన ఐఆర్‌ 6వ బెటాలియన్‌ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు లక్ష్మీదేవిపల్లి ప్రధాన రోడ్డుపై బైఠాయించారు.

సుమారు 800 ఆందోళన చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అంతకు ముందు వీరంతా లక్ష్మీదేవిపల్లి ప్రధాన రహదారిపై ప్రదర్శనగా కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్‌ యార్డు నుంచి ఎంజీ రోడ్డు వరకు ప్రదర్శన నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని 3వ బెటాలియన్‌ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు ఇబ్రహీంపట్నం బస్టాండు ఎదుట రాస్తారోకో చేశారు. ఆందోళనకారులను అరెస్టు చేసేందుకు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు డీసీపీ సూచన మేరకు రాస్తారోకో విరమించిన ఆందోళనకారులు అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.
image

Leave Your Comments