రీల్స్ పిచ్చి లో పడి ఇలా తయారయ్యారేంటి...!!!
అందరి టీవీ /డిజిటల్
రీల్స్.. రీల్స్.. రీల్స్…ఇపుడెక్కడ యువతను చూసినా చేతుల్లో ఫోన్లు. వాటిలో రీల్స్ వీడియోల వీక్షణం. తన్మయత్వంలో ఊగిపోవటం. పరిసరాలను, మనుషుల అలికిడినీ పట్టించుకోని ఏకాగ్రత వాటిపైనే. సెల్లు ఇప్పుడొక హస్తభూషణంగా మారింది. కాదు అది లేకుండా జీవితం క్షణం కూడా గడవని ప్రాణాంతక స్థితిలోకి వచ్చేశాం. యువత మరింతగానూ. కొన్ని అవసరాలు, ప్రయో జనాలూ ఉపయోగాలూ ఉన్నప్పటికీ అంతకు మించిన నష్టాలూ దానితో కొన్ని కొని తెచ్చుకుంటున్నా మనేది నిష్టుర సత్యం. ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో ఎవరికి వాళ్లు రీల్స్ చేస్తూ పెడు తుంటారు. సరదా కోసమని, సంచలనాల కోసమనీ లేదా పేరు కోసం, రేటింగ్ కోసం, ప్రసిద్ధి చెందాలనీ ఈ రీల్స్ చేస్తూ ఎన్నో ప్రమాదాలకు గురవుతున్న ఘటనలూ, కొందరైతే ప్రాణాలకే ముప్పుతెచ్చు కుంటున్న ఘటనలు చూస్తుంటే బాధ కలుగుతుంది. దాని తీవ్రత ఎంత పెరిగిందో అనే దానికి ఇవన్నీ ఉదాహరణగా నిలుస్తాయి.
ఈ మధ్య హైద్రాబాద్‌లోని హయత్‌నగర్ విజయవాద హైవే రోడ్డుపై యువకుడు వర్షంలో మోటార్‌బైక్‌తో విన్యాసాలు రీల్స్‌కోసం చేస్తుండగా ఒకరు చనిపోయారు. మరొకరికి తీవ్రగాయాల య్యాయి. చనిపోయిన యువకుని తల్లిదండ్రులు పడుతున్న క్షోభ, దు:ఖం భరించలేనిది. మొన్నామధ్య ఉత్తరభారతంలో పిల్లలు ఆడుకుంటూ ఉరివేసుకుంటున్నట్లు రీల్స్ చేయడానికి పూనుకున్నారు. ఒక పిల్లోడు ఉరివేసుకునే వీడియోను తీస్తున్నాడు. పాపం ఉరివేసుకునే పిల్లోడికి పొరపాటున నిజంగానే ఉరిబిగిసుకుని కాళ్లు కొట్టుకుంటుంటే, అది నటన అనుకుని చుట్టూ పిల్లలు చూస్తూ ఊరుకున్నారు. నిజంగానే పిల్లోడు చనిపోయాడు. ఎంత విషాదం అది. అంటే రీల్స్ పిచ్చి ఎంత తలకెక్కింది! ఈ రీల్స్ మోజులోనే సంచలనంకోసం ఉత్తరప్రదేశ్‌లో రైలు పట్టాలపై రీల్స్ చేస్తున్న వ్యక్తి నిర్లక్ష్యానికి అతని భార్య, మూడేండ్ల కుమారుడు దుర్మరణం పాలయ్యారు.
ఇలా ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ పిచ్చిలోకి మహిళలూ వచ్చి చేరుతున్నారు. జూలలో జంతువులతో దిగే ఫొటోలు, వాటర్‌ఫాల్స్, కొండలపై నుండి, సాహ సాలు చేస్తూ చేస్తున్న రీల్స్ మనుషులనే మింగేస్తున్నది. ఇంకా ఘోరమేమంటే, మనుషులు ప్రమాదంలో చిక్కుకున్నపుడు, వరదల్లో సహాయంకోసం అర్థిస్తున్న వాళ్లను వీడియోతీసి ఫేస్ బుక్కుల్లో పెడు తున్నారు తప్ప రక్షించడానికి పూనుకోవడంలేదు. సరదాగా, తమ నైపుణ్యాలను ప్రదర్శించడం, కళను ప్రదర్శించడానికి ఎవరూ వ్యతిరేకం కాదు. కానీ సాహసాల పేరుతో, సంచలనాల పేరుతో యువత పెడతోవ పట్టటం, ప్రాణాలనే కోల్పోవటం ఆందోళన కలిగించే విషయం.
చిన్నలు పెద్దలు ముఖ్యంగా యువత ఈ రీల్స్ చూడటానికే వాళ్ల సమయాలను కేటాయి స్తున్నారు. రోడ్ల మీదా, ప్రయాణాలలో, నడుస్తూనే తిలకిస్తూ తమలో తామే తన్మయత్వంలో నవ్వు కుంటూ ఉండటం మనం గమనించవచ్చు. ఇక ఈ రీల్స్‌లో హాస్యం వెర్రితలలు వేస్తోంది. చాలా అసభ్య కరమైన సంభాషణలతో, జుగుప్సాకరంగానూ తీస్తున్నారు. మహిళల అంగాంగ ప్రదర్శనలు, వివాహేతర సంబంధాలు, సెక్స్ అంశాలూ విపరీతంగా రీల్స్‌లలో చేరుతున్నాయి. బూతులు మాట్లాడటం, దాని కోసమే సంభాషణ, ఇంటర్వ్యూలు, చర్చలు పెరిగిపోయాయి. ఇవి యువత మెదళ్లపై మత్తు పదార్థాలు, మందులకంటే తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. పిల్లలు ఈ సెల్లు అలవాటులోపడి శారీరక మానసిక రోగులుగా మారుతున్నారు. తల్లిదండ్రులూ పిల్లలను చూసు కోవడం, వారి ఆటాపాటల్లో పాల్గొనడం, వారితో గడపడం చాలా అరుదైపోయింది. పిల్లలు ఏ మాత్రం విసిగించినా, తినక మారాం చేసినా సెల్లు అలవాటు చేస్తున్నారు. ఆటల్లేవు, స్నేహితులతో సంబంధాలూ తగ్గుతున్నాయి. అందుకనే ఆస్ట్రేలియాలో చిన్న పిల్లలు సోషల్‌మీడియా వాడకుండా పూర్తిగా నిషేధం విధించాలని యోచిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని వెల్లడించారు. మనం కూడా ఆ ఆలోచన చేస్తే బాగుంటుంది.
ఇక రీల్స్‌లో, యూట్యూబ్‌లలో వచ్చేవి, చెప్పేవే నిజమనుకుని నమ్మేయటమూ, బాధల పాలవ డమూ జరుగుతోంది. మొన్న బీహార్‌లో ఓ నకిలీ వైద్యుడు యూట్యూబ్‌లో చూస్తూ పిల్లోడికి ఆపరేషన్ చేసి బాలుడి ప్రాణాలను బలిగొన్నాడు. మనుషుల అభిరుచులను, ఆసక్తులను, ఆలోచనలను కాలుష్య మయం చేస్తున్న ఇటువంటి రీల్స్, యూట్యూబ్ వీడియోలు, వాట్సప్ కార్యక్రమాల పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా సంచలనాలకోసం రీల్స్ చేయటాన్ని అరికట్టాలి.