అందరి టీవీ డిజిటల్ న్యూస్ నర్సంపేట | ఉమ్మడి వరంగల్ జిల్లా: నవంబర్ 17: నర్సంపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో డిసెంబర్ 9న శ్రీ అయ్యప్ప స్వామి పంబా ఆరాట్ మహా అన్నదాన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు సోమవారం నర్సంపేటలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ కమిటీ బాధ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమ ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, అన్నదాన నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గత 25 సంవత్సరాలుగా నర్సంపేట శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగే పంబా ఆరాట్ కార్యక్రమానికి మహా అన్నదాతగా వ్యవహరిస్తూ, భక్తులకు అన్నదానం నిర్వహించారని గుర్తు చేశారు.
ఆయన ప్రారంభించిన సేవా సంప్రదాయాన్ని తమ కుటుంబం నేటికీ కొనసాగిస్తోందని, ప్రతి సంవత్సరం వేలాది మంది అయ్యప్ప భక్తులకు అన్నదానం చేస్తున్నామని తెలిపారు.
ఈ ఏడాది పంబా ఆరాట్ మహా అన్నదాన కార్యక్రమం గురించి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో మరింత ఘనంగా నిర్వహించాలని ఆదేశించారని పేర్కొన్నారు.
డిసెంబర్ 9న జరిగే ఈ మహా అన్నదాన కార్యక్రమానికి నర్సంపేట నియోజకవర్గంతో పాటు పరిసర మండలాల నుంచి వేలాది మంది అయ్యప్ప స్వాములు, మాలధారులు తరలివచ్చే అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
నర్సంపేట నియోజకవర్గ ప్రజలు, అయ్యప్ప భక్తులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి కోరారు.
ఈ సమావేశంలో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ బాధ్యులు, బీఆర్ఎస్ నియోజకవర్గ, మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.