అందరి టీవీ డిజిటల్ & జిల్లా ప్రతినిధి
తేదీ: 25-09-2026
భూమి దారి వివాదం.. మహిళ ఆత్మహత్య
మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భూపతిపేట గ్రామంలో విషాద ఘటన
మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భూపతిపేట గ్రామంలో భూమి దారి వివాదం విషాదానికి దారితీసింది. దారి విషయంలో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన 69 ఏళ్ల వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపతిపేట గ్రామానికి చెందిన తేజావత్ ద్వాలి (69) 2022 సంవత్సరంలో తన భూమి నుంచి 12 అడుగుల వెడల్పు గల దారిని జక్కుల మునేష్కు విక్రయించారు. అయితే అప్పటి నుంచి దారి విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో ఈ నెల 23న ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో దారి విషయమై జక్కుల రజిత, తేజావత్ ద్వాలి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
ఈ సందర్భంగా రజిత తనను కులం పేరుతో దూషిస్తూ, అసభ్య పదజాలంతో తిడుతూ “చచ్చిపో” అంటూ అవమానించి, బెదిరింపులకు గురిచేసిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ద్వాలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం, సెప్టెంబర్ 24న ఉదయం సుమారు 4:30 గంటలకు ద్వాలి మృతి చెందారు.
మృతురాలి మనవడు తేజావత్ రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గూడూరు ఎస్సై CH. రమేశ్ బాబు తెలిపారు.
భూమి దారి విషయంలో కొనసాగిన వివాదం చివరకు మహిళ మృతికి దారితీయడంతో భూపతిపేటలో విషాదం నెలకొంది.
అందరి టీవీ డిజిటల్ — ప్రజల కోసం... ప్రజలతో... ప్రజల గొంతుక.