ఆదర్శంగా నిలిచిన ఆదర్శం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు

Date: 2026-09-16
news-banner
అందరి టీవి డిజిటల్ న్యూస్ నర్సంపేట:
విద్యార్థుల భవిష్యత్తుతో పాటు పాఠశాల అభివృద్ధికి కూడా తమ వంతు సహకారం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు నర్సంపేటలోని ఆదర్శం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు.
పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండే ఏజెన్సీ నిర్వాహకులు కట్టెలను ఉపయోగిస్తూ వంట చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఉపాధ్యాయుల దృష్టికి వచ్చింది. ఏజెన్సీ నిర్వాహకుల ఇబ్బందులను తొలగించాలనే ఉద్దేశంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
తమ సొంత డబ్బులను సమకూర్చి గ్యాస్ స్టవ్‌ను వితరణగా అందజేశారు. దీంతో మధ్యాహ్న భోజనం వండే ఏజెన్సీ నిర్వాహకులకు కట్టెలతో వంట చేసే ఇబ్బందులు తొలగనున్నాయి.
ఇదే సందర్భంలో పాఠశాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సుమారు రూ.18 వేల విలువైన మ్యూజిక్ సిస్టమ్‌ను కూడా ఉపాధ్యాయులు పాఠశాలకు అందజేశారు. విద్యార్థుల కార్యక్రమాలు, ప్రార్థనా కార్యక్రమాలు, ఇతర పాఠశాల అవసరాలకు ఈ మ్యూజిక్ సిస్టమ్ ఉపయోగపడనుంది.
పాఠశాల అవసరాలను గుర్తించి స్వచ్ఛందంగా తమ సొంత నిధులతో సహాయం అందించిన ఉపాధ్యాయులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. రామకృష్ణ అభినందించారు. విద్యార్థుల సౌకర్యాలు, పాఠశాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు చూపుతున్న సేవాభావం అభినందనీయమని పేర్కొన్నారు.
పాఠశాల అవసరాలను కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా, తమ వంతు బాధ్యతగా భావించి ఉపాధ్యాయులు ముందుకు రావడం పట్ల పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు.

Leave Your Comments