వాతావరణానుకూల సాగుతోనే రైతుకు భద్రమైన భవిష్యత్ – ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి|కలెక్టర్ సత్యశారద.

Date: 2026-07-19
news-banner
.అందరి టీవీ డిజిటల్ | నర్సంపేట | జూలై 19:
మారుతున్న వాతావరణ పరిస్థితులు, నీటి వనరుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగు విధానంలో మార్పులు చేసుకుని శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. ఆదివారం నర్సంపేట రైతు వేదికలో నీటి వనరుల లభ్యత, వర్షాభావ పరిస్థితులు, ఆరుతడి పంటల సాగుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సంపేట డివిజన్ పరిధిలోని ఆరు మండలాల రైతులు ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. నియోజకవర్గంలో సుమారు 1.30 లక్షల ఎకరాల్లో వ్యవసాయం జరుగుతోందని, పాకాల, రంగయ్య, మాదన్నపేట చెరువులతో పాటు చిన్నచిన్న చెరువులు, బోర్లపై ఆధారపడి సాగు కొనసాగుతోందన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యంగా కురిసే అవకాశం లేదా ఒకేసారి అధిక వర్షాలు పడే పరిస్థితులు ఉండొచ్చని పేర్కొంటూ, రైతులు నష్టపోకుండా ముందస్తు ప్రణాళికతో ఆరుతడి పంటలను ఎంచుకోవాలని సూచించారు. చెరువుల కింద సాగు చేసే రైతులు అఖిలపక్ష కమిటీలను ఏర్పాటు చేసి, భవిష్యత్ పంటల ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. యాసంగి సీజన్‌కు సంబంధించిన ప్రణాళికలను కూడా ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని అన్నారు. ముఖ్యంగా నీటి వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటల సాగుపై శాస్త్రీయ సూచనలను పాటించాలని సూచించారు.
వ్యవసాయం, ఉద్యానవనం, నీటిపారుదల, భూగర్భ జలాలు, వాతావరణ శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన వివరాలను రైతులకు వివరించి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. రైతులు తమ సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి. సంధ్యారాణి, నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, జెడ్పీ సీఈవో రామ్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్, జిల్లా హార్టికల్చర్ అధికారి శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఆనందం, ఇరిగేషన్ శాఖ అధికారులు, సంబంధిత మండలాల తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Leave Your Comments